Tuesday 14 January 2014

నానారూపధరుడు నారాయణుడు వీడే


నానారూపధరుడు నారాయణుడు వీడే
పూనినవుపములెల్లా బొసగెనితనికి

గరిమ నేరులు వానకాలమునఁ బెనగొని
సొరిది సముద్రము చొచ్చినయట్లు
పురుషసూక్తమున విప్రులు సేసేమజ్జనము
అరుదుగ పన్నీరెల్లా నమరే నీ హరికి

అట్టే వెల్లమొయిళ్ళు ఆకసాన నిండినట్టు
గట్టిగా మేన నిండెను కప్పురకాపు
వొట్టి తన విష్ణుమాయ వొడలిపై వాలినట్టు
తట్టుపుణుగమరెను దైవాలరాయనికి

నిలువున సంపదలు నిలిచి రూపైనట్టు
తెలివి సొమ్ములపెట్టె దెరచినట్టు
అలమేలుమంగ వురమున నెలకొనెనిదె
చెలరేగి శృంగారాల శ్రీవేంకుటేశునికి

No comments:

Post a Comment