Tuesday 14 January 2014

అంతరంగమెల్ల శ్రీహరికి ఒప్పించుకుంటె



అంతరంగమెల్ల శ్రీహరికి ఒప్పించుకుంటె
వింతవింత విధముల వీడునా బంధములు

మనుజుడై ఫలమేది మరిజ్ఞాని యౌదాకా
తనువెత్తి ఫలమేది దయగలుగుదాకా
ధనికుడై ఫలమేది ధర్మము సేయుదాకా
పనిమాలి ముదిసితే పాసెనా భవము

చదివియు ఫలమేది శాంతము కలుగుదాకా
పెదవెత్తి ఫలమేది ప్రియమాడు దాకా
మదిగల్గి ఫలమేది మాధవుదలచు దాకా
ఎదుట తాను రాజైతే ఏలెనాపరము

పావనుడై ఫలమేది భక్తి కలిగినదాకా
జీవించి ఫలమేది చింత దీరుదాకా
వేవేల ఫలమేది వేంకటేశు గన్నదాకా
భావించితా దేవుడైతే ప్రత్యక్షమౌనా

అంతర్యామి అలసితి సొలసితి



అంతర్యామి అలసితి సొలసితి
ఇంతట నీ శరణిదె జొచ్చితిని

కోరిన కోర్కులు కోయని కట్లు
తీరవు నీవవి తెంచక
భారపు బగ్గాలు పాప పుణ్యములు
నేరుపుల బోనీవు నీవు వద్దనక

జనుల సంగముల జక్క రోగములు
విను విడువవు నీవు విడిపించక
వినయపు దైన్యము విడువని కర్మము
చనదది నీవిటు శాంతపరచక

మదిలో చింతలు మైలలు మణుగులు
వదలవు నీవవి వద్దనక
ఎదుటనె శ్రీ వెంకటేశ్వర నీవదె
అదన గాచితివి అట్టిట్టనక

అందరికి నెక్కుడైన హనుమంతుడు



అందరికి నెక్కుడైన హనుమంతుడు
అందుకొనె సూర్యఫలమని హనుమంతుడు

బల్లిదుడై లంకజొచ్చి బలురాకాసుల గొట్టి
హల్లకల్లోలము చేసె హనుమంతుడు
వొల్లనె రాముల ముద్దుటుంగరము సీత కిచ్చె
అల్లదె నిలుచున్నాడు హనుమంతుడు

దాకొని యాకెముందర తనగుఱు తెరుగించి
ఆకారమటు చూపె హనుమంతుడు
చేకొని శిరోమణి చేతబట్టి జలనిధి
ఆకసాన దాటివచ్చె హనుమంతుడు

కొంకకిట్టె సంజీవి కొండ దెచ్చి రిపులకు
నంకకాడై నిలిచెను హనుమంతుడు
తెంకినే శ్రీవెంకటాద్రి దేవుని మెప్పించినాడు
అంకె కలశాపురపు హనుమంతుడు

ఆలించు పాలించు ఆదిమ పురుషా




ఆలించు పాలించు ఆదిమ పురుషా
జాలిదీర నీకే శరణుజొచ్చితిమి ॥

గతినీవె మతినీవె కర్తవుభర్తవు నీవె
పతివినీవె ఏ పట్టున మాకు
ఇతరము లెవ్వరున్నారెంచిచూడ నినుబోల
చతురుడా నిన్నునే శరణు జొచ్చితిమి॥

జననీ జనకులు శరణము నీవె
వునికి మనికి నీవె వుపమ నీవె
మనిసిచ్చె నీవె నన్ను మన్నించుకోటేనె
చనవి మనవి శరణుజొచ్చితిమి॥

లోక సాక్షివి నీవె లోకబంధుడు నీవె
ఈకడ శ్రీవేంకటేశ యిదివో నీవె
నీ కంటె మరిలేరు నిఖిలమంతయు గావ
సాకారరూప నీకె శరణు జొచ్చితిమి॥

అలవటపత్రశాయివైన రూప మిట్టిదని



అలవటపత్రశాయివైన రూప మిట్టిదని
కొలువై పొడచూపేవా గోవిందరాజా

పడతులిద్దరిమీద పాదములు చాచుకొని
వొడికపురాజసాన నొత్తగిలి
కడలేనిజనాభికమలమున బ్రహ్మను
కొడుకుగా గంటివిదె గోవిందరాజా

సిరులసొమ్ములతోడ శేషునిపై బవళించి
సొరిది దాసుల గౄప జూచుకొంటాను
పరగుదైత్యులమీద పామువిషములే నీవు
కురియించితివా గోవిందరాజా

శంకుజక్రములతోడ జాచినకరముతోడ
అంకెల శిరసుకిందిహస్తముతోడ
తెంకిని శ్రీవేంకటాద్రి దిగువతిరుపతిలో
కొంకక వరములిచ్చే గోవిందరాజా

అలరులు గురియగ నాడెనదే



అలరులు గురియగ నాడెనదే
అలకల గులుకుల నలమేలుమంగ

అరవిరి సొబగుల నతివలు మెచ్చగ
అర తెర మరుగున నాడె నదే
వరుసగ పూర్వదు వాళపు తిరుపుల
హరి గరగింపుచు నలమేలుమంగ

మట్టపు మలపుల మట్టెలకెలపుల
తట్టెడి నడపుల దాటెనదే
పెట్టిన వజ్రపు పెండెపు దళుకులు
అట్టిట్టు చిమ్ముచు నలమేలుమంగ

చిందుల పాటల శిరిపొలయాటల
అందెల మ్రోతల నాడె నదే
కందువ తిరువెంకటపతి మెచ్చగ
అందపు తిరుపుల నలమేలుమంగ

అలర చంచలమైన



అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీవుయ్యాల
పలుమారు నుఛ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల
ఉదాయాస్త శైలంబు లొనర కంభములైన వుడుమండలము మోచె నుయ్యాల
అదన ఆకాశపదము అడ్డౌదూలంబైన అఖిలంబు నిండె నీ వుయ్యాల

పదిలముగ వేదములు బంగారు చేరులై పట్టివెరపై తోచెనుయ్యాల
వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింప నరుదాయె వుయ్యాల

మేలు కట్లయి మీకు మేఘమండలమెల్ల మెరుగునకు మెరుగాయె వుయ్యాల
నీలశైలము వంటి నీ మేని కాంతికి నిజమైన తొడవాయె వుయ్యాల

పాలిండ్లు కదలగా పయ్యదలు రాపాడ భామినులు వడినూచు వుయ్యాల
వోలి బ్రహ్మాణ్డములు వొరుగునో యని భీతి నొయ్య నొయ్యనైరి వూచిరుయ్యాల

కమలకును భూసతికి కదలు కదలకు మిమ్ము కౌగలింపగ జేసె నుయ్యాల
అమరాంగనలకు నీ హావ భావ విలాస మందంద చూపె నీ వుయ్యాల

కమలాసనాదులకు కన్నులకు పండుగై గణుతింప నరుదాయె వుయ్యాల
కమనీయ మూర్తి వేంకటశైలపతి నీకు కడువేడుకై వుండె వుయ్యాల

అలమేలుమంగనీ వభినవరూపము



అలమేలుమంగనీ వభినవరూపము
జలజాక్షు కన్నులకు చవులిచ్చేవమ్మ

గరుడాచలాధీశు ఘనవక్షముననుండి
పరమానంద సంభిరతవై
నెరతనములు జూపి నిరంతరమునాథుని
హరుషింపగ జేసి తిగదమ్మ

శశికిరణములకు చలువలచూపులు
విశదముగా మీద వెదజల్లుచు
రసికత పెంపున కరగించి ఎప్పుడు నీ
వశముజేసుకొంటి వల్లభునోయమ్మ

రట్టడి శ్రీవేంకటరాయనికి నీవు
పట్టపురాణివై పరగుచు
వట్టిమాకులిగిరించు వలపుమాటలవిభు
జట్టిగొని వురమునసతమైతివమ్మ

ఆకటి వేళల అలపైన వేళల



ఆకటి వేళల అలపైన వేళల
తేకువ హరినామమే దిక్కు మరి లేదు

కొఱమారియున్న వేళ కులము చెడిన వేళ
చెఱవడి వొరుల చేజిక్కినవేళ
వొఱపైన హరినామమొక్కటే గతి గాక
మఱచి తప్పిననైన మఱి లేదు తెరగు

ఆపద వచ్చిన వేళ ఆరడి బడిన వేళ
పాపపు వేళల భయపడిన వేళ
వోపినంత హరినామ మొక్కటే గతి గాక
మాపు దాకా పొరలిన మరిలేదు తెరగు

సంకెల బెట్టిన వేళ చంప బిలిచిన వేళ
అంకిలిగా నప్పుల వారాగిన వేళ
వేంకటేశు నామమే విడిపించ గతినాక
మంకు బుద్ది పొరలిన మరిలేదు తెరగు

అహోబలేశ్వరుడు అరికులదమనుడు





అహోబలేశ్వరుడు అరికులదమనుడు
మహా మహిమలకు మలసీవాడె

కదలు కన్నులును కరాళవదనము
గుదిగొను భయదపు కోరలను
అదరు మీసములు అలరగ నవ్వుచు
వుదుట తోడ కొలువున్నాడు వాడె

అతిసిత నఖములు అనంత భుజములు
వితత పరాక్రము వేషమును
అతుల దీర్ఘజిహ్వయు కడు మెరయగ
మితిలేని కరుణ మెరసీ వాడు

సందడి సౌమ్యములు శంఖచక్రములు
పొందుగ దివిజులు పొగడగను
ఇందిర దొడపై నిడి శ్రీవేంకట
మందు నిందు కడు అలరీ వాడే

అదివో చూడరో అందరు మొక్కరో



అదివో చూడరో అందరు మొక్కరో
గుదిగొను బ్రహ్మము కోనేటిదరిని

రవిమండలమున రంజిల్లు తేజము
దివి చంద్రునిలోని తేజము
భువిననలంబున బొడమిన తేజము
వివిధంబులైన విశ్వతేజము

క్షీరంబుధిలో చెలగు సాకారము
సారె వైకుంఠపు సాకారము
యీరీతి యోగీంద్రులెంచు సాకారము
సారెకు జగముల సాకారము

పొలసినయాగంబులలో ఫలమును
పలుతపములలో ఫలమును
తలచిన తలపుల దానఫలంబును
బలిమి శ్రీవేంకటపతియే ఫలము

అన్నిటికి నిదె పరమౌషధము




అన్నిటికి నిదె పరమౌషధము
వెన్నుని నామము విమలౌషధము

చిత్త శాంతికిని శ్రీపతి నామమె
హత్తిన నిజ దివ్యౌషధము
మొత్తపు బంధ విమోచనంబునకు
చిత్తజ గురుడే సిద్ధౌషధము

పరిపరి విధముల భవరోగములకు
హరి పాద జలమె యౌషధము
దురిత కర్మముల దొలగించుటకును
మురహరు పూజే ముఖ్యౌషధము

ఇల నిహ పరముల నిందిరా విభుని
నలరి భజింపుటె యౌషధము
కలిగిన శ్రీ వేంకటపతి శరణమె
నిలిచిన మాకిది నిత్యౌషధము

అన్నిటా జాణవు నీకు నమరు నీ జవరాలు



అన్నిటా జాణవు నీకు నమరు నీ జవరాలు
కన్నుల పండుగ గాను కంటిమి నేడిపుడు

సేయని సింగారము చెలియ చక్కదనము
మోయని మోపు గట్టిముద్దుచన్నులు
పూయకపూసిన పూత పుత్తడి మేనివాసన
పాయని చుట్టరికము పైకొన్న చెలిమి

గాదెబోసిన మణులు కనుచూపు తేటలు
వీదివేసిన వెన్నెల వేడుకనవ్వు
పోదితో విత్తిన పైరు పొదిలిన జవ్వనము
పాదుకొన్న మచ్చికలు పరగువలపులు

పుట్టగా బుట్టిన మేలు పోగము సమేళము
పెట్టెబెట్టిన సొమ్ములు పెనురతులు
యిట్టె శ్రీవేంకటేశ యీ యలమేలుమంగను
నిట్టన గూడితి వీకె నిండిన నిధానము

బండి విరిచి పిన్న పాపలతో నాడి



బండి విరిచి పిన్న పాపలతో నాడి
దుండగీడు వచ్చె దోబూచి

పెరుగు వెన్నలు బ్రియమున వే
మరు ముచ్చిలించు మాయకాడు
వెరవున్నాదన విధము దాచుకొని
దొరదొంగ వచ్చె దోబూచి

పడచు గుబ్బెత పరపుపై పోక
ముడి గొంగు నిద్రముంపునను
పడియు దావద్ద బవళించినట్టి
తోడుకు దొంగ వచ్చె దోబూచి

గొల్లెపల్లెలో యిల్లిల్లు చొచ్చి కొల్లెలాడిన కోడెకాడు
యెల్లయినా వేంకటేశుడు ఇదే తొల్లిటి దొంగ వచ్చె దోబూచి

అన్నివిభవముల అతడితడు


అన్నివిభవముల అతడితడు
కన్నులువేవేలు గలఘనుడు

వేదాంత కోటులవిభుడు ఇతడు
నాదబ్రహ్మపు నడుమితడు
ఆదియంత్యముల కరుదితడు
దేవుడు సరసిజ నాభుడు ఇతడు

భవములణచు యదుపతి యితడు
భువనము లన్నిటికి పొడ వితడు
దివికి దివమైన తిరమితడు
పవనసుతు నేలిన పతి యితడు

గరుడుని మీదటి ఘనుడితడు
సిరు లందరి కిచ్చే చెలు వితడు
తిరు వేంకట నగము దేవు డితడు
పరమ పదమునకు ప్రభు వితడు

తందనాన అహి - తందనాన పురె



తందనాన అహి - తందనాన పురె
తందనాన భళా - తందనాన

బ్రహ్మమొక్కటె పర - బ్రహ్మమొక్కటె
పరబ్రహ్మమొక్కటె పర బ్రహ్మమొక్కటె

కందువగు హీనాధికములిందు లేవు
అందరికి శ్రీహరే అంతరాత్మ
ఇందులో జంతుకుల మంతానొక్కటె
అందరికి శ్రీహరే అంతరాత్మ

నిండార రాజు నిద్రించు నిద్రయు నొకటె
అంటనే బంటునిద్ర అదియు నొకటె
మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి యొకటె
చండాలు డుండేటి సరిభూమి యొకటే

కడగి యేనుగు మీద కాయు యెండొకటే
పుడమి శునకము మీద బొలయు యెండొకటే
కడుపుణ్యులను పాపకర్ములను సరిగావ
జడియు శ్రీ వేంకటేశ్వరుని నామమొకటె

బ్రహ్మ కడిగిన పాదము


బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము తానెని పాదము

చెలగి వసుధ కొలిచిన నీ పాదము
బలి తల మోపిన పాదము
తలకగ గగనము తన్నిన పాదము
బలరిపు గాచిన పాదము

కామిని పాపము కడిగిన పాదము - పాము తలనిడిన పాదము
ప్రేమతొ శ్రీ సతి పిసికెడి పాదము -పామిడి తురగపు పాదము

పరమ యోగులకు పరి పరి విధముల - పరమొసగెడి నీ పాదము
తిరువేంకటగిరి తిరమని చూపిన - పరమ పదము నీ పాదము

అదిగో కొలువై వున్నాడు


అదిగో కొలువై వున్నాడు
అలమేలు మంగపతి
పదివేల విధములను
పారు పత్తెము చేయుచు

రంగ మండపములో
రత్న సింహాసనముపై
అంగనామణులతొ
అమరవేంచేసి
బంగారు పావడలు పసరించి యిరుగడల
శృంగారముగ సురలు సేవ సేయగను

వెండి పైడి గుదియలను నేత్రహస్తులు పొగడ
నిండు వెన్నెల పూల దండలు అమర
గుండిగలు కానుకలను పొనర లెక్కలు చేయ
దండిమీరగ నిపుడు దేవరాయడు చెలగి

అంగ రంగ వైభవముల రంగుగా చేకొనుచు
మంగళ హారతుల మహిమ వెలసీ
శృంగార మైనట్టిమా శ్రీవేంకటాధిపుడు
అంగనలు కొలువగాను యిపుడు వేంచేసి 

అచ్యుత మిమ్ము(దలచే యంతపని వలెనా


అచ్యుత మిమ్ము(దలచే యంతపని వలెనా
యిచ్చల మీవారే మాకు నిహపరాలియ్యగా

మిమ్ము నెఱిగినయట్టి మీదాసుల నెఱిగే-
సమ్మతి విజ్ఞానమే చాలదా మాకు
వుమ్మడి మీసేవ సేసుకుండేటి వైష్ణువుల
సమ్ముఖాన సేవించుటే చాలదా నాకు

నిరతి నీకు మొక్కేటినీడింగరీలకు
సరవితో మొక్కుటే చాలదా నాకు
పరగ నిన్ను పూజించే ప్రపన్నులపూజించే
సరిలేని భాగ్యము చాలదా నాకు

అంది నీకు భక్తులైన యలమహానుభావుల-
చందపు వారిపై భక్తి చాలదా నాకు
కందువ శ్రీవేంకటేశ కడు నీబంటుబంటుకు
సందడి బంటనవుటే చాలదా నాకు

ఎప్పుడు గాని రాడో యెంతదడవాయ కాలి


ఎప్పుడు గాని రాడో యెంతదడవాయ కాలి
చప్పుడాలకించి మతి జల్లురనెనమ్మా

ఇద్దరమదరిపాటు యేకాంతాన నాడుకొన్న
సుద్దులు దలచిమేను చురుకనెనమ్మా
పెద్దగా కస్తూరిబొట్టు పెట్టిననాతడు గోర
తిద్దుట దలచి మేను దిగులనెనమ్మా

పాయక యాతడూ నేనుఁ బవ్వళించే యింటివంకఁ
బోయి పోయి కడుఁ జిన్నబోతి నోయమ్మా
తోయపు గుబ్బల చన్నుదోయి మీద వాడొత్తిన
పాయపుఁ జంద్రుల జూచి భ్రమసితినమ్మా

కూడిన సౌఖ్యములందు కొదలేని వాని నా
వేడుక మతిఁ దలచి వెరగాయ నమ్మా
యీడులేని తిరువేంకటేశుడిదె నాతోడో
నాడినట్టే నాచిత్తమలరించే నమ్మా

కమలాసన సౌభాగ్యము కలికితనంబులు సొబగులు


కమలాసన సౌభాగ్యము కలికితనంబులు సొబగులు
ప్రమదంబులు నింతంతని పలుకాంగా రాదు

మించిన చొక్కులు మీరినయాసలు
పంచేంద్రియముల భాగ్యములు
యెంచిన తలపులు యెడపని వలపులు
పంచబాణుని పరిణత (తు) లూ

కనుగవ జలములు కమ్మని చెమటలు
అనయము చెలులకు నాడికలు
తనువున మరపులు తప్పని వెఱపులు
వినుకలి కనుకలి వేడుకలు

మోవి మెరుంగులు ముద్దుల నగవులు
శ్రీవేంకతపతి చిత్తములు
తావుల పూతలు దర్పకు వ్రాతలు
ఆ విభుఁ గూడిన యలసములు

హరినెఱగని జన్మ మదియేలా



హరినెఱగని జన్మ మదియేలా ఆ
సరుస నాతడు లేని చదువేలా

దయ తొలగినయట్టి తపమేలా
భయము లేనియట్టి భక్తేలా
ప్రియము మానినయట్టి పెనగేలా మంచి
క్రియావిరుద్ధపు కీర్తనలేలా

ఫలములేనియట్టి పనులేలా కడు
కలిమిలేనియట్టి గర్వమేలా
బలిమిలేని యట్టి పంతమేలా శౌరి
తలచని యట్టి తనువది యేలా

తన కమరని దొరతనమేలా
చనవు లేని యట్టి సలిగె యేలా
యెనలేని శ్రీవేంకటేశ్వరుని శరణని
మనగలిగిన మీద మరిచింతలేలా

కలిగెమాకు నిది కైవల్యం


కలిగెమాకు నిది కైవల్యం
కలకాలము హరికథాశ్రవణం

అచింత్య మద్భుత మానందం
ప్రచురం దివ్యం పావనం
సుచరిత్రం శ్రుతిశోభితం
అచలం బిదివో హరికీర్తనం


నిరతం నిత్యం నిఖిల శుభకరం
దురితహరం భవదూరం
పరమమంగళం భావాతీతం
కరివరదం నిజకైంకర్యం

సులభం సుకరం శోకనాశనం
ఫలదం లలితం భయహరణం
కలితం శ్రీవేంకటపతిశరణం
జలజోదరనిచ్చ స్తోత్రం

కాలములారును గలిగె నీకునిదె


కాలములారును గలిగె నీకునిదె
బాలకి యందే పై పై నీకు

సతికొప్పు విరులు జలజల రాలిన
లతలవసంత కాలము నీకు
కతగా తనమైకాకలు చూపిన
అతివేసవి కాలమప్పుడే నీకు

కాగిటిచెమటల కడు నినుఁ దడిపిన
కాగల తొలుకరి కాలమది
వీగని చూపుల వెన్నెల చల్లిన
రాగినమతికి శరత్కాలంబు

లంచపుఁబులకల లలన నీరతుల
కంచపు హేమంత కాలమది
యెంచగ శ్రీవెంకటెశ వలపుసతి
వంచ శిసిరకాల వైభవమాయ

కొమ్మ నీ పలుకులకు కుశలమస్తు


కొమ్మ నీ పలుకులకు కుశలమస్తు
సమ్మదపు వయసు కైశ్వర్యమస్తు

బెడగు కళలను చాల పెంపొందించుచున్న నీ
యుడురాజు మోముకభ్యుదయమస్తు
కడివోని నీరజపు కళికలను గేరు, నీ
నెడద కుచములకు నభివృధ్ధిరస్తు

వొగరు మిగులగ తేనె లొలుకు నున్నటి నీ
చిగురు మోవికిని ఫల సిద్ధిరస్తు
సొగసు చక్రములతో సొలయు నీ పిరుదులకు
అగణిత మనోరథావ్యాప్తిరస్తు

తనరు తుమ్మెదగములఁ దరము నీ కురులకును
అనుపమంబైన దీర్ఘాయురస్తు
నను ద్వారకాకృష్ణుడనుచుఁ గూడిన నీకు
అనుదినము నిత్య కల్యాణమస్తు

కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు


కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడు వాడు....

కుమ్మర దాసుడైన కురువరతినంబి
యిమ్మన్న వరములెల్ల యిచ్చిన వాడు
దొమ్ములు సేసిన యట్టి తొండ మాన్ చక్కుర వర్తి
రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన వాడు..

అచ్చపు వేడుకతోడ అనంతాళు వారికి
ముచ్చిలి వెట్టికి మన్ను మోచిన వాడు
మచ్చిక దొలక దిరుమలనంబి తోడుత
నిచ్చనిచ్చ మాటలాడి నొచ్చిన వాడు..

కంచిలోనుండ తిరుకచ్చినంబి మీద
కరుణించి తనయెడకు రప్పించిన వాడు
ఎంచి యెక్కుడైన వేంకటేశుడు మనలను
మంచివాడై కరుణ పాలించినవాడు 

ఇందిరా నామము ఇందరికి


ఇందిరా నామము ఇందరికి
కుందనపు ముద్దవో గోవిందా

అచ్యుత నామము అనంత నామము
ఇచ్చిన సంపదలు ఇందరికి
నచ్చిన సిరులు నాలుకతుదలు
కొచ్చి కొచ్చివో గోవిందా

వైకుంఠ నామము వరద నామము
ఈకడ నాకడ ఇందరికి
వాకుదెరపులు వన్నెలు లోకాల
కూగులు వంతులునో గోవిందా

పండరి నామము పరమ నామము
ఎండలు బాపెడి ఇందరికి
నిండు నిధానమై నిలిచిన పేరు
కొండల కోనేటివో గోవిందా 

నాకునాకే సిగ్గయ్యీని నన్ను జూచుకుంటేను


నాకునాకే సిగ్గయ్యీని నన్ను జూచుకుంటేను
చేకొని నీవే మన్నించ చెయ్యొగ్గేగాని

సేయరాని పాపములు సేసివచ్చి యేనోర
నాయెడ నిన్ను వరములడిగేను
కాయముతో యింద్రియకింకరుడనై యేమని
చేయూర నీబంటనని చెప్పుకొనేను

వేగిలేచి సంసారవిధులకే వొడిగట్టి
యేగతి కొసరి నీపై నేట వేసేము
ఆగడపు బంగారుకాతుమనేన (య) మ్ముకొని
భోగపు మోక్షము నెట్టు వొందించు మనేము

కలుపుట్టుగుబతుకు కాంతలకు వెచ్చపెట్టి
వలసి నేడెట్టు నీవార మయ్యేము
నెలవై శ్రీవేంకటేశ నీవే కరుణించితివి
బలిమి సేసి నీకెట్టు భారము వేసేము

నీవున్న చోటనే వైకుంఠము


నీవున్న చోటనే వైకుంఠము నెరసులు మరి చొరరాదు
పావన మది చెప్పేది వేదము పాటింపగవలెను

దేవుడా నా దేహమె నీకు తిరుమలగిరి పట్టణము
భావింప హృదయకమలమె బంగారపు మేడ
వేవేలు నా విజ్ఞానాదులు వేడుకపరిచారకులు
శ్రీవల్లభా యిందులో నితరచింతలు వెట్టకువే

పరమాత్మ నా మనసే బహురత్నంబుల మంచము
గరిమల నా యాత్మే నీకు కడు మెత్తని పఱపు
తిరముగ నుజ్ఞానదీప మున్నది దివ్యభోగమె ఆనందము
మరిగితి నీవున్నయెడల నిక మాయల గప్పకువే

ననిచిన నా వూరుపులే నీకు నారదాదుల పాటలు
వినయపు నా భక్తియె నీకును వినోదమగు పాత్ర
అనిశము శ్రీవేంకటేశ్వర అలమేల్మంగకు పతివి
ఘనుడవు నన్నేలితి విక కర్మము లెంచకువే

నానారూపధరుడు నారాయణుడు వీడే


నానారూపధరుడు నారాయణుడు వీడే
పూనినవుపములెల్లా బొసగెనితనికి

గరిమ నేరులు వానకాలమునఁ బెనగొని
సొరిది సముద్రము చొచ్చినయట్లు
పురుషసూక్తమున విప్రులు సేసేమజ్జనము
అరుదుగ పన్నీరెల్లా నమరే నీ హరికి

అట్టే వెల్లమొయిళ్ళు ఆకసాన నిండినట్టు
గట్టిగా మేన నిండెను కప్పురకాపు
వొట్టి తన విష్ణుమాయ వొడలిపై వాలినట్టు
తట్టుపుణుగమరెను దైవాలరాయనికి

నిలువున సంపదలు నిలిచి రూపైనట్టు
తెలివి సొమ్ములపెట్టె దెరచినట్టు
అలమేలుమంగ వురమున నెలకొనెనిదె
చెలరేగి శృంగారాల శ్రీవేంకుటేశునికి

నందగోపనందనుడే నాటిబాలుడు


నందగోపనందనుడే నాటిబాలుడు
ఇందునేడె రేపల్లె నేచి పెరిగెను

పువ్వువంటి మఱ్ఱియాకు పొత్తిఁబవళించనేర్చె
యెవ్వడోకాని తొల్లె యీబాలుడు
మువ్వంక వేదములను ముద్దుమాటలాడనేర్చె
యెవ్వరూ కొంతనేర్ప నేటికే వీనికి

తప్పుటడుగు లిడగనేర్చె ధరణియందు నాకసమున
నెప్పుగా రసాతలమున నొంటి తొల్లియో
రెప్పలెత్తి చూడనేర్చె రేసీఁజెంద్రునందు పగలు
గొప్పసూర్యునందు నింకఁ గొత్త నేర్పనేటికే

మంచివెన్నబువ్వ లిపుడు మలసి యారగించనేర్చె
నంచితముగ శ్రీవేంకటాద్రి మీదను
యెంచి యప్పలప్పలనుచు యెనసి కాగిలించనేర్చె
దించరానివురము మీద దివ్యకాంతను

నీవొక్కడవే నాకుచాలు నీరజాక్ష నారాయణ


నీవొక్కడవే నాకుచాలు నీరజాక్ష నారాయణ
నీవే నాకు గతి అని తెలిసితి నెక్కొని ఇతరము వృథా వృథా

నీనామోచ్ఛరణమే నెరసిన దుఖ నివారణము
నీనామోచ్చరణమే నెలగూ శుభకరము
నా నా వేదశస్త్రములు నవపురాణ ఇతిహాసములు
నీ నామములోనే వున్నవి మిగిలిన వన్నియు వృథా వృథా

నీ పాదమూలము నింగియు భువియు రాసాతలము
నీ పాదమూలము నిఖిల జీవ పరినామములు
దీపించిన చరాచరంబులు దివ్యులు మునులు సర్వమును
ఈ పాదమూలమే మరి మిగిలిన వన్నియు వృథా వృథా

దేవా మీ తిరుమేను దిక్కును బ్రహ్మాండాధారము
దేవా మీ తిరుమేను ఉత్పత్తిస్థితిలయములకును ఆకరము
శ్రీ వేంకటపతి నాభావము చిత్తము నీకే సమర్పణ
దేవా నీ శరణమును జొచ్చితి దిక్కులన్నియు వృథా వృథా

అణురేణు పరిపూర్ణమైన రూపము


అణురేణు పరిపూర్ణమైన రూపము
అణిమాదిసిరి అంజనాద్రిమీది రూపము

వేదాంతవేత్తలెల్ల వెదకేటిరూపము
ఆదినంత్యము లేని యారూపము
పాదుగ యోగీంద్రులు భావించురూపము
యీదెస నిదివో కోనేటిదరి రూపము

పాలజలనిధిలోన (బవళించేరూపము
కాలపు సూర్యచంద్రాగ్నిగల రూపము
మేలిమి వైకుంఠాన మెరసిన రూపము
కీలైనదిదె శేషగిరిమీదిరూపము

ముంచినబ్రహ్మాదులకు మూలమైనరూపము
కొంచని మఱ్ఱాకుమీది కొనరూపము
మంచి పరబ్రహ్మమై మమ్మునేలిన రూపము
యెంచగ శ్రీవేంకటాద్రి నిదె రూపము

అతడే పరబ్రహ్మం


అతడే పరబ్రహ్మం అతడే లోకనాయకుడు
అతనికంటే మరి అధికులు లేరయ్యా

కమలవాసిని లక్ష్మి కలదా యెవ్వరికైనా?
కమలనాభునికి ఒక్కనికే కాక
కమలజుడైన బ్రహ్మ కలడా యెవ్వని నాభిన్
అమర వంద్యుడు మాహరికే కాక

అందరునుండెది భూమి అన్యులకు కలదా
అందపు గోవిందునికే ఆలాయగాక
చెందిన శ్రీభాగీరథి శ్రీపాదాల గలదా
మంధరధరుడైన మాధవునికే(కి) గాక

నిచ్చలు అభయమిచ్చే నేరుపు యెందుగలదా
అచ్చుగా నారాయణునియందే గాక
రచ్చల శరణాగతరక్షణమెందు గలదా
తచ్చిన శ్రీవేంకటాద్రి దైవానికేగాక

ఆడరో పాడరో అప్సరోగణము


ఆడరో పాడరో అప్సరోగణము
వీడెము లిందరో విభవము నేడు

కమలారమణుని కళ్యాణమునకు
తమినదె గరుడాధ్వజ మెసగె
తెమలుచు మ్రోసెను దివ్యదుందుభులు
గమనించరో దివిగల దేవతలు

వెలయగ లక్ష్మీవిభుని పెండ్లికిని
బలసి అంకురార్పణ మదివో
కలగొన నిచ్చేరు గంధాక్షతలచే
చెలగి కైకొనరో శ్రీవైష్ణవులు

బడి శ్రీ వేంకటపతికి శ్రీసతికి
అడరిన తలబాలందె నదె
నడచి పరుషలు నానా ముఖముల
ముడుపులు చదువరో ముయిగా నరులు

ఆతడే బ్రహ్మణ్యదైవము


ఆతడే బ్రహ్మణ్యదైవము ఆది మూలమైన వాడు
ఆతని మానుటలెల్ల అవిథిపూర్వకము

ఎవ్వని పేర పిలుతురు ఇల పుట్టిన జీవుల
నవ్వుచు మాస నక్షత్ర నామముల
అవ్వల ఎవ్వని కేశవాది నామములే
రవ్వగా ఆచమనాలు రచియింతురు

అచ్చ మేదేవుని నారాయణ నామమే గతి
చచ్చేటి వారికి సన్యాసము వారికి
ఇచ్చ నెవ్వరి తలచి యిత్తురు పితాళ్ళాకు
ముచ్చట నెవ్వని నామములనే సంకల్పము

నారదుదు తలచేటినామ మది యెవ్వనిది
గౌరినుడిగేటినామకథ యేడది
తారకమై బ్రహ్మరుద్రతతి కెవ్వరి నామకు
యీరీతి శ్రీవేంకటాద్రి నెవ్వడిచ్చీ వరము

అన్నిటా నాపాలిటికి



అన్నిటా నాపాలిటికి హరియాతడే కలడు |
ఎన్నికగా తుది పదమెక్కితిమి మేలు ||

కొందరు జీవులు నన్ను కోపగించినా మేలు- |
చెంది కొందరు అట్టే సంతసించినా మేలు |
నిందించి కొందరు నన్ను నేడే రోసినా మేలు |
పొందుగా కొందరు నన్ను పొగడినా మేలు ||

కోరి నన్ను పెద్దసేసి కొందరు మొక్కినా మేలు |
వేరె హీనుడని భావించినా మేలు |
కూరిమి కొందరు నన్ను గూడుకుండినా మేలు |
మేరతో విడిచి నన్ను మెచ్చుకున్నా మేలు ||

ఇప్పటికి గలపాటి యెంత పేదయినా మేలు |
వుప్పతిల్లు సంపద నాకుండినా మేలు |
యెప్పుడు శ్రీవేంకటేశుకే నిచ్చిన జన్మమిది |
తప్పు లేదాతనితోడి తగులమే మేలు ||