Tuesday 14 January 2014

నీవున్న చోటనే వైకుంఠము


నీవున్న చోటనే వైకుంఠము నెరసులు మరి చొరరాదు
పావన మది చెప్పేది వేదము పాటింపగవలెను

దేవుడా నా దేహమె నీకు తిరుమలగిరి పట్టణము
భావింప హృదయకమలమె బంగారపు మేడ
వేవేలు నా విజ్ఞానాదులు వేడుకపరిచారకులు
శ్రీవల్లభా యిందులో నితరచింతలు వెట్టకువే

పరమాత్మ నా మనసే బహురత్నంబుల మంచము
గరిమల నా యాత్మే నీకు కడు మెత్తని పఱపు
తిరముగ నుజ్ఞానదీప మున్నది దివ్యభోగమె ఆనందము
మరిగితి నీవున్నయెడల నిక మాయల గప్పకువే

ననిచిన నా వూరుపులే నీకు నారదాదుల పాటలు
వినయపు నా భక్తియె నీకును వినోదమగు పాత్ర
అనిశము శ్రీవేంకటేశ్వర అలమేల్మంగకు పతివి
ఘనుడవు నన్నేలితి విక కర్మము లెంచకువే

No comments:

Post a Comment